Sunday 21 May 2017

KAILASH MANASAROVAR YATRA



కైలాశ్ మానసరోవర్ యాత్ర

హిందూవులకు మతపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన కైలాశ్ మానసరోవర్ యాత్రను భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. శివుడి నివాస ప్రాంతం కావడంతో మౌంట్ కైలాశ్ అత్యంత పూజ్యనీయ స్థలంగా భావించబడుతోంది. శివుడు తన భార్య పార్వతీ దేవితో కలిసి ఇదే ప్రాంతంలో ధ్యాన స్థితిలో ఉంటాడని హిందూవుల విశ్వాసం. 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ కైలాశ్ శివుడి నివాసంగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మంది ఈ యాత్రలో పాల్గొంటారు. మౌంట్ కైలాశ్, మానసరోవర్ సరస్సులను హిందూ మతస్థులే కాకుండా, జైనులు, బౌద్ధులు కూడా పవిత్ర స్థలాలుగా భావిస్తారు. ఈ మతాలవారందరూ కొన్ని వేల సంవత్సరాలనుండి ఈ పర్వతాన్ని కాలి నడకన సందర్శిస్తూ ఉంటారు.


భారత దేశ పౌరులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనడానికి అర్హులు. భక్తులు ఆధ్యాత్మికత, సాహసంతో కూడిన ఈ యాత్ర పూర్తి చేసి శివుడి దీవెనలందుకొని, పవిత్రమైన మానసరోవర్ సరస్సులో స్నానమాచరిస్తారు. ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ యాత్రలో పాల్గొనడానికి విదేశాంగ మంత్రిత్వశాఖ  యాత్రికులకు ఎలాంటి రాయితీలు కానీ, ఆర్ధిక సహాయం కానీ అందించదు.


మానసరోవర్ సరస్సు పవిత్రమైన మౌంట్ కైలాశ్ క్రింది ప్రాంతంలో ఉంటుంది. ఈ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న, తాజా నీరు ఉండే సరస్సు. ఇది సముద్ర మట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆసియాలోని అత్యంత పవిత్రమైన సరస్సులలో ఒకటైన మానసరోవర్ టిబెట్ లో ఉంది. ఈ సరస్సు తన రంగులను మారుస్తూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. చంద్రుని కాంతిలో ఈ సరస్సు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. బ్రహ్మ దేవుడు ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాల్లో ఉంది. మతపరమైన కార్యక్రమాలు జరపడానికి ఇది అనువైన ప్రాంతమని బ్రహ్మదేవుడు భావించాడు. మానసరోవర్ సరస్సు పరిసర ప్రాంతాలలో తీర్థపురి, గౌరీ కుండ్, యమ్ ద్వార్, ఆస్తపాడ్, టర్బోచే వంటి చూడవలసిన ప్రాంతాలనేకం ఉన్నాయి.


ఈ యాత్ర చేయాలనుకొనే వారికి ముందుగా ఢిల్లీలో 3 రోజులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు . కాలి నడకన గానీ, బస్సులలో గానీ, హెలికాఫ్టర్ లో  గానీ యాత్రికులు ఈ యాత్ర చేయవచ్చు. అందుబాటులో ఉన్న సదుపాయాలతో యాత్రికులు తమ యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. గుడారాలలో బస చేయడం, చాపలపై నిద్రించడం వంటివి ఈ యాత్రలో భాగమే. ఇక్కడి ప్రకృతి అందాలకు యాత్రికులు తన్మయత్వం చెందుతారు.


19,500 అడుగుల ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడం కూడా ఈ యాత్రలో భాగమే. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. శారీరకంగా, మానసికంగా బలహీనులైన వారికీ ఈ యాత్ర ప్రమాదకరమే. ఒక్కోసారి ఈ యాత్ర షెడ్యూల్ మారే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ లోని కొన్ని ప్రాంతాల పర్యటన చేయాలంటే స్థానికంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుంది. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే ప్రాణ, ఆస్థి నష్టాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భాద్యత వహించదు. ఒక వేళ ఎవరైనా మరణిస్తే, వారి మృత దేహాన్ని అంతక్రియల కోసం భారత దేశంలోకి తీసుకొని రావాల్సిన నైతిక బాధ్యత భారత ప్రభుత్వానికి లేదు. అలాంటి వారి అంత క్రియలు చైనా భూభాగంలోనే జరపడానికి అంగీకరిస్తూ వారు ముందుగానే డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయసున్న భారత దేశ పౌరులు మాత్రమే ఈ యాత్ర చేయడానికి అర్హులు. మౌంట్ కైలాశ్  టిబెట్ లోని ట్రాన్షిమాలయ లో భాగంగా ఉంటుంది. పశ్చిమ టిబెట్ లోని సుదూర ప్రాంతంలో ఈ పర్వతం ఉంటుంది.

అత్యంత క్లిష్టమైన ట్రెక్కింగ్ పూర్తి అయిన తర్వాత, మౌంట్ కైలాశ్ శిఖరం చుట్టూ పరిక్రమ చేయాల్సి ఉంటుంది. క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ దిశలో ఇక్కడ ప్రదక్షిణం చేయడాన్నే పరిక్రమ అంటారు. ఇది పూర్తి చేయడానికి సాధారణంగా మూడు రోజుల సమయం పడుతుంది. కాలి నడకన వెళ్లలేని వారికి చిన్న గుర్రాలను అద్దెకు తీసుకొనే అవకాశం ఉంటుంది.


రెండు ప్రత్యేక మార్గాలలో ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్య ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ రెండు మార్గాలు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్, సిక్కిం లోని నాథు లా పాస్.


లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) : ఈ మార్గంలో యాత్ర పూర్తి చేయడానికి 24 రోజులు పడుతుంది. మొత్తం రూ. 1. 6 లక్షలు ఖర్చవుతుంది.

నాథూలా పాస్ (సిక్కిం) : ఈ మార్గంలో యాత్ర పూర్తి చేయడానికి 21 రోజుల సమయం పడుతుంది. మొత్తం రూ. 2 లక్షలు ఖర్చవుతుంది.

ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగా ఈ క్రింది ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.  http://kmy.gov.in/kmy/howToApply.do?lang=en_US

2017 సంవత్సరానికి ఈ యాత్రకు దరఖాస్తు చేయాల్సిన గడువు ముగిసింది. ఇక ఈ యాత్ర చేయాలనుకొనే వారు 2018 లో ప్రయత్నించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_